Pulihora Avakaya : మనకు వేసవికాలంలో కాలంలో లభించే వాటిల్లో మామిడికాయలు ఒకటి. మామిడికాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడికాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మామిడికాయలతో మనం ఎక్కువగా పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. అందులో కూడా రకరకాల రుచులతో పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఈ మామిడికాయలతో చేసుకోదగిన పచ్చళ్లల్లో పులిహోర ఆవకాయ కూడా ఒకటి. మామిడికాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడికాయలతో పులిహోర ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పులిహోర ఆవకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు – 3 గ్లాసులు, ఆవ పిండి – పావు గ్లాస్, కారం – అర గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, పల్లి నూనె – ఒక గ్లాస్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, ఇంగువ – కొద్దిగా.
పులిహోర ఆవకాయ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత అర గ్లాస్ నూనె పోసి కలపాలి. ఇలా అంఆ కలిసేలా చక్కగా కలిపిన తరువాత మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె చక్కగా వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని మామిడికాయ ముక్కల్లో వేసి కలపాలి. తరువాత మరో గ్లాస్ నూనె పోసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడిని రెండు రోజుల పాటు ఊరబెట్టిన తరువాత సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులిహోర ఆవకాయ తయారవుతుంది. మామిడికాయ ముక్కలను కొలిచిన గ్లాస్ తో ఉప్పు, కారం, నూనె వంటి వాటిని తీసుకుంటే పచ్చడి రుచిగా వస్తుంది. ఇది 20 నుండి నెల రోజుల వరకు తాజా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయలతో ఈ విధంగా తయారు చేసిన పులిహోర ఆవకాయను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ఎంతో రుచిగా ఉండే పులిహోర ఆవకాయను తయారు చేసుకుని తినవచ్చు.