Punugulu : మనం ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా పునుగులను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పునుగులు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. వీటిని మనం ఎక్కువగా మినప పప్పు లేదా మిగిలిన ఇడ్లీ పిండితో తయారు చేస్తూ ఉంటాం. ఈ పునుగులను మనం మిగిలిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కోసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నంతో ఎంతో రుచిగా ఉండే పునుగులను తయారు చేసుకుని తినవచ్చు. మిగిలిన అన్నంతో చాలా సులువుగా పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, శనగ పిండి – ముప్పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, క్యారెట్ తురుము – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అన్నాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పునుగులు తయారవుతాయి. వీటిని ఉదయం అల్పాహారంగా కానీ సాయంత్రం స్నాక్స్ గా కానీ తయారు చేసుకుని తినవచ్చు. మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఇలా పునుగులుగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పునుగులను టమాట చట్నీ, పల్లీ చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.