Rabbit On Moon : భూమికి ఉన్న ఏకైక సహజసిద్ధ ఉపగ్రహం చంద్రుడు. తెలుగు వారు చంద్రున్ని చందమామ అని పిలుస్తారు. మామ కాని మామ చందమామ.. చందమామ రావె.. జాబిల్లా రావె.. అంటూ తల్లులు తమ చిన్నారులకు గోరు ముద్దలు తినిపిస్తుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలకు చంద్రుని పట్ల అనేక అపోహలు ఉన్నాయి. వాటిని వింటుంటే.. అవి నిజమేనేమో అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ అవి నిజంగా అపోహలే.. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా. పౌర్ణమి రోజుల్లో రోమన్లు తమ దేవత లూనా (గాడెస్ ఆఫ్ ది మూన్) ఆకాశంలో తన వెండి రథంలో ప్రయాణిస్తుందని నమ్ముతారు. ఆ సమయంలో శాపగ్రస్తులైన కొందరు మనుషులు తోడేలు మనుషులు (వేర్ వోల్వ్స్)గా మారుతారని నమ్ముతారు. తోడేలు మనిషి అంటే.. సగం మనిషి.. సగం తోడేలు అన్నమాట. పౌర్ణమి రోజుల్లో వారికి శక్తి ఎక్కువగా ఉంటుందని రోమన్లు నమ్ముతారు. ఇక ఆ రోజున కొందరు నిద్రలో నడుస్తారని, పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తారని, సూసైడ్లు చేసుకుంటారని కూడా కొన్ని దేశాల్లో నమ్ముతారు.
చంద్రుని మీద గ్రహాంతర జీవులు నివాసం ఉంటారని.. అందుకనే మనం అక్కడికి వెళ్లలేకపోతున్నామని నమ్మేవారు కూడా ఉన్నారు. 1820లలో బవేరియన్ అస్ట్రానమర్ ఫ్రాంజ్ వాన్ పౌలా గ్రుయితుయిసెన్ చంద్రుని మీద గ్రహాంతర జీవులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయని, దాన్ని తాను టెలిస్కోప్‌లో చూశానని చెప్పాడు. ఇక 1835లో సర్ విలియం హెర్షెల్ అనే మరో బ్రిటిష్ అస్ట్రానమర్ కూడా ఇదే విషయం చెప్పాడు. దీంతో చంద్రుని మీద గ్రహాంతర జీవులు ఉన్నాయని కొందరు ఇప్పటికీ నమ్ముతారు. అమావాస్య అయిపోయాక పౌర్ణమి సమీపించే రోజుల్లో సంగమిస్తే మహిళలు సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా కొన్ని దేశాల వారు నమ్ముతారు. ఆ సమయంలో చైనా దేవత్ చాంగ్ ఇ టు మామా క్విల్లా ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అందుకనే ఆ సమయంలో మహిళలు సంతానం పొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతారు.
చంద్రుడు కేవలం ఒక డొల్ల పదార్థమని.. లోపల అంతా ఏమీ ఉండదని.. పైకి మాత్రం ఒక కప్పులా కనిపిస్తుందని.. కొందరు నమ్ముతారు. చంద్రుని మీద ఇప్పటి వరకు పలు దేశాలకు చెందిన వ్యోమగాములు కాలు మోపినా.. ఇంకా చంద్రుని మీదకు ఎవరూ వెళ్లలేదు.. అని నమ్మేవారు కూడా ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ నియంత హిట్లర్ తాను చనిపోయాననే విషయాన్ని ప్రచారం చేసి.. చంద్రుని మీదకు వెళ్లి అక్కడ జీవించాడని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. అలాగే నాజీలకు చెందిన ఒక బేస్ (కేంద్రం) కూడా చంద్రుని మీద ఉందని, వారు భూమిపైకి ఫ్లయింగ్ సాసర్ (యూఎఫ్‌వో)లను పంపుతున్నారని.. కొందరు నమ్ముతారు.
మన దేశంతోపాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు, బౌద్ధులు.. చంద్రుని మీద ఒక దైవత్వం ఉన్న కుందేలు నివాసం ఉంటుందని నమ్ముతారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. నిజానికి ఇవన్నీ నిరూపితం కాలేదు. అయినప్పటికీ ఇవన్నీ నిజాలేనని కొందరు ఇప్పటికీ నమ్ముతారు.