Ragi Bobbatlu : బొబ్బట్లు.. ఇవి తెలియని వారు, వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుగలకు వీటిని మనం ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా వీటిని ఎక్కువగా మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని ఉపయోగించకుండా పప్పు ఉడికించే అవసరం లేకుండా రాగి పిండితో కూడా మనం ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో రుచికరమైన బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా, పసుపు – కొద్దిగా, రాగిపిండి – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, నీళ్లు – రెండు కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రాగి బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా గోధుమపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత తరువాత నూనె వేసి పిండి చేతులకు అంటుకోకుండా జారుడుగా కలుపుకోవాలి. తరువాత దీనిపైమూతను ఉంచి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రాగి పిండి, కొబ్బరి తురుము వేసి కలుపుతూ వేయించాలి. పిండి చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చేటప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి బెల్లం నీటిని పోసి కలపాలి. దీనిని ఉండలు పట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రాగిపిండి మిశ్రమం దగ్గరపడిన తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని మరింత దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు అలాగే ఉంచాలి.
రాగి పిండి మిశ్రమం చల్లారిన తరువాత ఉండలుగా చేసుకోవాలి. అలాగే గోధుమపిండిని కూడా మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు గోధశుమపిండిని ఉండను పలుచగా వత్తుకుని అందులో రాగి పిండి ఉండను ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత దీనిని అరటి ఆకు లేదా ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ మీద నూనె రాసుకుంటూ బొబ్బట్ల ఆకారంలో వత్తుకోవాలి. పెనం వేడయ్యాక బొబ్బట్టును వేసి కాల్చుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి బొబ్బట్లు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.