Rava Halwa : మనం బొంబాయి రవ్వతో ఉప్మాతో పాటు రకరకాల తీపి వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. రవ్వతో చేసుకోదగిన చక్కటి తీపి వంటకాల్లో రవ్వ హల్వా కూడా ఒకటి. రవ్వ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పట్టినప్పటికి తయారు చేయడం మాత్రం చాలా తేలిక. రవ్వతో ఎంతో రుచిగా ఉండే హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 10.
రవ్వ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో 3 కప్పుల నీటిని పోసి కలపాలి. తరువాత ఈ రవ్వను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత రవ్వను ఒక నిమిషం పాటు చేత్తో బాగా నలుపుతూ కలపాలి. తరువాత ఒక వస్త్రం సహాయంతో రవ్వను వడకట్టుకుని అందులో ఉండే నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ రవ్వను మరలా గిన్నెలోకి తీసుకుని మరో కప్పు నీళ్లు పోసి మరలా కలపాలి. ఇలా కలిపిన తరువాత రవ్వను మరలా వడకట్టుకుని నీటిని తీసుకోవాలి. ఇలా మూడు సార్లు చేసిన తరువాత నీటిపై మూతను ఉంచి అర గంట పాటు కదిలించకుండా ఉంచాలి.
అరగంట తరువాత పైన పేరుకుపోయిన నీటిని పడబోసి అడుగున ఉన్న రవ్వ పాలను బాగా కలుపుకోవాలి. ఈ పాలు ఒక గ్లాస్ ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, అర గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే లోపు మరో గిన్నెలో క్యారమెల్ కోసం 3 టీ స్పూన్ల పంచదార, ఒక టీ స్పూన్ నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి నల్లగా అయ్యే వరకు కలుపుతూ వేడి చేయాలి. పంచదార క్యారమెల్ లా అయిన తరువాత దీనిని పంచదార పాకంలో వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న రవ్వ పాలను పోసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి.
5 నిమిషాల తరువాత రెండు టీ స్పూర్ల నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు వేడి చేసిన తరువాత మరో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. రవ్వ మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరయ్యేటప్పుడు మిగిలిన నెయ్యి వేసి కలపాలి. దీనిని నెయ్యి పైకి తేలే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ హల్వా తయారవుతుంది. ఈ విధంగా రవ్వతో తయారు చేసిన ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.