Nalleru Plant : మన ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఔషధ మొక్కలల్లో నల్లేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉండడంతో పాటు మన పెరటికే అందాన్ని తీసుకు వస్తుంది. ఈ మొక్క చూడడానికి నాలుగు పలకలుగా, అందంగా ఉంటుంది. నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా నల్లేరు చాలా సులభంగా పెరుగుతుంది. తీగ లాగా పాకుతూ పెరిగే నల్లేరు మొక్కతో కూరలు, పచ్చళ్లు, పులుసు, వడియాలు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. నల్లేరు మొక్కను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నల్లేరు మొక్కను ఉపయోగించి మనం శ్వాస రోగాలను, కఫ రోగాలను, చర్మ రోగాలను దూరం చేసుకోవచ్చు. ఈ నల్లేరు మొక్కను సంస్కృతంలో వజ్రవల్లీ అని, హిందీలో హడ్ సంహారి అని పిలుస్తారు. నల్లేరు మొక్క గుజ్జుకు సమానంగా మినపప్పును కలిపి మెత్తగా రుబ్బాలి.
ఈ మిశ్రమాన్ని వడియాలుగా పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వడియాలను రెండు పూటలా నిప్పులపై కాల్చుకుని తినడం వల్ల అన్ని రకాల వాత రోగాలు తొలగిపోతాయి. నల్లేరును ఉపయోగించి మనం ఎంతకి తగ్గని ఎక్కిళ్లను కూడా తగ్గించుకోవచ్చు. నల్లేరు కాడలను పొయ్యి\లో వేసి ఉడకబెట్టాలి. తరువాత దీనిని దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అర చెంచా మోతాదులో తీసుకుని దానికి ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా రెండు పూటలా తీసుకోవడం వల్ల ఎంతకి తగ్గని ఎక్కిళ్లు కూడా వెంటనే తగ్గిపోతాయి. నల్లేరు గుజ్జుతో పచ్చడి లేదా కూర చేసుకుని తినాలి. ఇలా తినడం వల్ల తొడలను స్థంభింపజేసే ఊరు స్తంభ వాత రోగం తగ్గు ముఖం పడుతుంది. నల్లేరును ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది.
ఉబ్బురోగంతో బాధపడే వారికి నల్లేరు ఎంతో చక్కగా పని చేస్తుంది. నల్లేరు కాడలను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను రెండు పూటలా పూటకు రెండు గ్రాముల మోతాదులో గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉబ్బు రోగం తగ్గు ముఖం పడుతుంది. అలాగే నల్లేరు కాడలతో ఉప్పు, చింతపండుకారం కలిపి పచ్చడిగా చేసుకోవాలి. ఈ పచ్చడిని అన్నంతో తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. విరిగిన ఎముకలను అతికేలా చేయడంలో నల్లేరును మించిన ఔషధం లేదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నల్లేరును ఉడికించి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమానంగా ఆవునెయ్యిని కలిపినెయ్యి మిగిలే వరకు వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని రెండు పూటలా రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
కొండనాలుక సమస్యతో బాధపడే వారు నల్లేరు వడియాలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నల్లేరు గుజ్జుకు మూడు రెట్ల బియ్యం కలిపి మెత్తగా నూరి వడియాలుగా చేసుకోవాలి. ఈ వడియాలు పచ్చిగా ఉండగానే నిప్పులపై కాల్చాలి. ఇలా కాల్చిన వడియాలను కొద్ది కొద్దిగా తింటూ ఉంటే కొండనాలుక సమస్య తగ్గుతుంది. ఇలా అనేక రకాల సమస్యలను తగ్గించడంలో నల్లేరు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని పచ్చడిగా, కూరగా వండుకుని తింటే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.