Ravva Vadalu : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మా, రవ్వ లడ్డూలు, రవ్వ కేసరి వంటి వంటలే కాకుండా వీటితో మనం వడలను కూడా తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే వడలు ఎంత రుచిగా ఉంటాయో రవ్వతో చేసే ఈ వడలు కూడా అంతే రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. అలాగే వీటిని మనం చాలా సులభంగా కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పిండి రుబ్బే పని లేకుండా ఇన్ స్టాంట్ గా రవ్వతో వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – పావు టేబుల్ స్పూన్, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం – అర టేబుల్ స్పూన్, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, నువ్వులు – అర టేబుల్ స్పూన్.
రవ్వ వడల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఇందులో ఉడికించిన బంగాళాదుంపలను ఉండలు లేకుండా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని ప్లాస్టిక్ కవర్ మీద లేదా అరటి ఆకు మీద ఉంచి చేతికి తడి చేసుకుంటూ వడలా వత్తుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి కాల్చుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ వడలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ మినపప్పుతోనే కాకుండా ఇలా రవ్వతో కూడా రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ వడలను అందరూ ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.