Raw Coconut Ice Cream : పచ్చి కొబ్బ‌రితో ఎంతో టేస్టీగా ఉండే చ‌ల్ల చ‌ల్ల‌ని ఐస్ క్రీమ్‌.. త‌యారీ ఇలా..!

Raw Coconut Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో, బేక‌రీల్లో, షాపుల్లో ఇవి విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్స్ ల‌భిస్తూ ఉంటాయి. వివిధ ర‌కాల ఐస్ క్రీమ్ వెరైటీల‌ల్లో కొకోన‌ట్ ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. కొబ్బ‌రి ప్లేవ‌ర్ తో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కొకోన‌ట్ ఐస్ క్రీమ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిగా, క‌మ్మ‌గా, చ‌ల్ల‌చ‌ల్ల‌టి కొకోన‌ట్ ఐస్ క్రీమ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోన‌ట్ ఐస్ క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి చిప్ప – 1, నీళ్లు – అర క‌ప్పు, పాలు – ఒకటిన్న‌ర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, పంచ‌దార – అర క‌ప్పు.

Raw Coconut Ice Cream recipe in telugu very easy and tasty
Raw Coconut Ice Cream

కొకోన‌ట్ ఐస్ క్రీమ్ త‌యారీ విధానం..

ముందుగా ప‌చ్చి కొబ్బ‌రిపై ఉండే న‌లుపు భాగాన్ని తీసేసి కొబ్బ‌రిని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. ఇందులో అర క‌ప్పు పాలు పోసి ఉండ‌లు లేకుండా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వ‌చ్చిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి కార్న్ ఫ్లోర్ పాలు మివ్ర‌మం వేసి క‌లుపుతూ వేడి చేయాలి. ఈ పాలు కొద్దిగా చిక్క‌బ‌డిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. దీనిని పంచ‌దార క‌రిగే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి జార్ లో వేసి మ‌రోసారి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇలా మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మాన్ని మూత ఉండే ప్లాస్టిక్ డ‌బ్బాలో లేదా స్టీల్ గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత దీనిపై అల్యూమినియం పాయిల్ ను ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు వీటిని 7 నుండి 8 గంట‌ల పాటు డీ ఫ్రిజ్ లో త‌క్కువ ఉష్ణోగ్ర‌త వద్ద ఉంచాలి. ఇలా ఫ్రీజ్ చేసిన త‌రువాత ఐస్ క్రీమ్ ను డీ మౌల్డ్ చేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొకోన‌ట్ ఐస్ క్రీమ్ త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే కొకోన‌ట్ ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకుని చ‌ల్ల చ‌ల్ల‌గా తిన‌వ‌చ్చు.

D

Recent Posts