Rayalaseema Natukodi Pulusu : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ నాటుకోడి పులుసు.. ఇలా వండాలి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Rayalaseema Natukodi Pulusu : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక ర‌కాల నాన్ వెజ్ వంటకాల‌ను తినాల‌ని చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు వంటి వాటికి చెందిన వంట‌ల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. ఇక చాలా మంది తినే వంట‌ల్లో చికెన్ వంట‌లే ఎక్కువ‌గా ఉంటాయి. అందులోనూ బ్రాయిల‌ర్ కాకుండా నాటుకోడి అయితే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. నాటుకోడి పులుసు చేస్తే నాన్ వెజ్ ప్రియులు ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఇక అందులోనూ రాయ‌ల‌సీమ స్టైల్‌లో చేస్తే.. ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే రాయ‌ల‌సీమ స్పెష‌ల్ నాటుకోడి పులుసును ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాయ‌ల‌సీమ స్పెష‌ల్ నాటుకోడి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాటుకోడి చికెన్ – 500 గ్రాములు , వెల్లుల్లి – 1, ఉల్లిపాయ – 1, కొత్తిమీర – 1 క‌ట్ట‌, అల్లం – పావు క‌ప్పు, కొబ్బ‌రి – చిన్నకప్పు, లవంగాలు – 6, ధనియాలు – 1 టీస్పూన్‌, ఎండు మిరపకాయలు – 2, నిమ్మకాయ – ఒకటి, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కారం – 1 టీస్పూన్‌, నూనె – 3 టేబుల్ స్పూన్లు.

Rayalaseema Natukodi Pulusu recipe in telugu tasty dish
Rayalaseema Natukodi Pulusu

రాయ‌ల‌సీమ స్పెష‌ల్ నాటుకోడి పులుసును త‌యారు చేసే విధానం..

స్టవ్ పై ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండు మిరపకాయలు, లవంగాలు, ధనియాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఎండు మిరపకాయలు, ధనియాలు, లవంగాలు, కొబ్బ‌రి, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ ప‌ట్టుకోవాలి. చికెన్ తయారు చేయడానికి ముందుగా మసాలాను ఈ విధంగా తయారుచేసి పెట్టుకోవాలి.

తరువాత చికెన్ ను ఒక గిన్నెలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. అందులో నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక మనకు అవసరం అయితే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే నూనె వేడెక్కిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ ను బాగా కలియబెడుతూ రెండు నిమిషాలపాటు నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల మసాలా పచ్చి వాసన రాకుండా చికెన్ ముక్కలకు ఉప్పు, కారం బాగా పడుతుంది.

ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ లో నీళ్ళు పోసి మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ వెళ్లే వరకు వేచి ఉండాలి. ప్రెజర్ వెళ్ళిన తరువాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఉడికించడంతో ఎంతో రుచి కరమైన రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు తయార‌వుతుంది. దీన్ని అన్నం, రాగి సంక‌టి, రొట్టెలు, చ‌పాతీలు.. వేటితో తిన్నా స‌రే రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts