Rayalaseema Special Uggani : మనం బొరుగులతో చేసే వంటకాల్లో ఉగ్గాని కూడా ఒకటి. ఉగ్గాని చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఉగ్గానిని ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ చేసే ఉగ్గాని కంటే ఈ విధంగా తయారు చేసిన ఉగ్గాని మరింత రుచిగా ఉంటుంది. ప్రత్యేకమైన పొడి వేసి చేసే ఈ ఉగ్గాని తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మరింత రుచిగా రాయలసీమ స్టైల్ లో ఉగ్గానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీకి కావల్సిన పదార్థాలు..
బొరుగులు – 200 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు, పసుపు – అర టీ స్పూన్, పుట్నాల పప్పు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 4 నుండి 6, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీ విధానం..
ముందుగా జార్ లో పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మకరివేపాకు, ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బొరుగులను నీటిలో వేసి తడపాలి. తరువాత వీటిని చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత బొరుగులు, ఉప్పు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉగ్గాని తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.