Rice Phirni : రైస్ పిర్ణి.. బియ్యంతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పండగలకు, స్పెషల్ డీస్ లో లేదా తీపి తినాలనిపించినప్పుడు ఇలా బియ్యంతో రైస్ పిర్ణిని తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రైస్ పిర్ణిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ పిర్ణి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – గుప్పెడు, చిక్కటి పాలు – అర లీటర్, కుంకుమపువ్వు – చిటికెడు, పంచదార – 4 లేదా 5 టీ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రైస్ పిర్ణి తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని కొద్దిగా పాలు పోసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వ వేసి కలపాలి. బియ్యం రవ్వ మెత్తగా అయ్యే వరకు దీనిని కలుపుతూ ఉడికించాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ పిర్ణి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా బియ్యంతో రుచికరమైన పిర్ణిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.