Ulli Bendakaya Fry : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లి బెండకాయ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి అలాగే సైడ్ డిష్ గా తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఉల్లి బెండకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి బెండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – పావుకిలో, పెటల్స్ లాగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 10, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి- అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
ఉల్లి బెండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. తరువాత మరీ చిన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని మరో 10 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి బెండకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి బెండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.