Saggubiyyam Pesarapappu Bellam Payasam : మనం ఇంట్లో చేసుకునే తీపి వంటకాల్లో పాయసం కూడా ఒకటి. పాయసం చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం రకరకాల పాయసాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో సగ్గుబియ్యం పాయసం కూడా ఒకటి. సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. వేసవికాలంలో దీనిని తాగడం వల్ల మన శరీరానికి మరింత మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
3 గంటల పాటు నానబెట్టిన సగ్గుబియ్యం – ఒక కప్పు, నానబెట్టిన పెసరపప్పు – అర కప్పు, నీళ్లు – 5 కప్పులు, బెల్లం తురుము – రెండు కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, కాచి చల్లార్చిన చిక్కటి పాలు – 2 కప్పులు.
సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బెల్లాన్ని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికిన తరువాత కరిగించిన బెల్లం పాకం వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసం పూర్తిగా చల్లారిన తరువాత ఇందులో పాలు పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవికాలంలో ఈ పాయసాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.