Sajja Dosa : స‌జ్జ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దోశ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Sajja Dosa : మ‌నం ర‌క‌ర‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌జ్జ‌లు మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

ఈ స‌జ్జ‌ల‌తో మ‌నం అన్నం, సంగ‌టి, రోటి, దోశ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల‌తో చేసే దోశ చాలా రుచిగా ఉంటుంది. స‌జ్జ పిండి ఉండాలే కానీ దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే స‌జ్జ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Sajja Dosa recipe in telugu how to make it
Sajja Dosa

స‌జ్జ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
స‌జ్జ పిండి – ఒక టీ గ్లాస్, బియ్యం పిండి – ఒక టీ గ్లాస్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – ఒక క‌ప్పు, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – రెండు ముప్పావు గ్లాస్, నూనె – ఒక క‌ప్పు.

స‌జ్జ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో స‌జ్జ పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్క‌లు, క్యారెట్ తురుము, ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, జీల‌క‌ర్ర‌, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి అర గంట నుండి ఒక గంట పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి. పిండి చ‌క్క‌గా నానిన త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక పిండిని క‌లుపుకుంటూ దోశ‌లా వేసుకోవాలి. ఈ దోశ ర‌వ్వ దోశ లాగా ఉంటుంది. ఈ దోశ‌ను రెండు వైపులా కాల్చుకునే అవ‌స‌రం ఉండ‌దు. ఒక‌వైపు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌జ్జ దోశ త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. పిండి రుబ్బుకునేంత స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా త‌క్కువ స‌మ‌యంలో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా స‌జ్జ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ దోశ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts