Semiya Cutlet Recipe : సేమియాతో మనం పాయసమే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. సేమియాతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో సేమియా కట్లెట్స్ కూడా ఒకటి. సేమియా, బంగాళాదుంపతో చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభంం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ సేమియా కట్లెట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా కట్లెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, బొంబాయి రవ్వ – 2 టీ స్పూన్స్, ఉడికించి తురిమిన బంగాళాదుంపలు – 2, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర -కొద్దిగా, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మైదాపిండి – 2 లేదా 3 టీ స్పూన్స్, సేమియా – అర కప్పు , నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సేమియా కట్లెట్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత రవ్వ వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపల తురుమును వేసి కలపాలి. తరువాత పసుపు,ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా వేసి కలపాలి. దీనిని పిండి ముద్దలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి.
తరువాత బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకుని కట్లెట్ లాగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని ఒక్కొక్కటిగా మైదాపిండిలో ముంచాలి. తరువాత సేమియాతో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్లెట్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండువైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా కట్లెట్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సేమియాతో తరుచూ పాయసమే కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తినవచ్చు. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.