Sesame Chutney : నువ్వులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని వంటల్లో నేరుగా లేదా పొడి రూపంలో వేస్తుంటారు. అందువల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక నువ్వుల నుంచి తీసే నూనె కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మసాజ్‌లు లేదా వంటలకు ఉపయోగించవచ్చు. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి నూనెను తప్పక ఉపయోగించాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక నువ్వులతో మనం అనేక రకాల వంటలను చేసుకోవచ్చు. వాటిల్లో నువ్వుల చట్నీ కూడా ఒకటి. ఇది ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, నిమ్మరసం – కొద్దిగా, చక్కెర – ఒక టీస్పూన్, కొత్తిమీర – ఒక కట్ట, పచ్చి మిర్చి – నాలుగు, ఉప్పు – తగినంత.
నువ్వుల చట్నీని తయారు చేసే విధానం..
ముందుగా నువ్వులను వేయించాలి. తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత అందులో కొత్తిమీర, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేయాలి. కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీంతో నువ్వుల చట్నీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా ఇడ్లీ, దోశ వంటి ఏ బ్రేక్‌ఫాస్ట్‌తో అయినా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.