Soft Butter Milk Cake : మనకు బేకరీలల్లో లభించే పదార్థాల్లో మిల్క్ కేక్ కూడా ఒకటి. చాలా మంది ఈ కేక్ ను ఇష్టంగా తింటారు. మిల్క్ కేక్ చాలా రుచిగా, చాలా మృదువుగా ఉంటుంది. అయితే ఈ కేక్ ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల బేకరీ స్టైల్ మిల్క్ కేక్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా ఈ మిల్క్ కేక్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే బేకరీ స్టైల్ మిల్క్ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, పంచదార – ముప్పావు కప్పు లేదా ఒక కప్పు, నూనె లేదా బటర్ – పావు కప్పు, మైదాపిండి – బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, పాలు – అర కప్పు, బటర్ – 3 టేబుల్ స్పూన్స్, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్.
మిల్క్ కేక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో కోడిగుడ్లు, పంచదార, నూనె వేసి పంచదార కరిగే వరకు మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండిని, బేకింగ్ పౌడర్ ను జల్లించి వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత అందులో బటర్ వేసి కలపాలి. బటర్ కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను ముందుగా కలుపుకున్న కేక్ మిశ్రమంలో వేసి మరలా అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత బేకింగ్ ట్రేను తీసుకుని దానికి నెయ్యి రాయాలి.
తరువాత దానిపై మైదాపిండిని చల్లుకోవాలి. లేదంటే బటర్ పేపర్ ను ట్రేలో వేసుకోవాలి. తరువాత కేక్ మిశ్రమాన్ని వేసుకుని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేను ఫ్రీహీట్ చేసుకున్న ఒవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 35 నుండి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత ట్రేను బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ట్రే నుండి వేరు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ కేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.