Special Tomato Pappu : టమాటాలను మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని కూర లేదా ఇతర కూరగాయలతో కలిపి వండుతుంటారు. అయితే టమాటాలతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. దేంతో తిన్నా సరే భలే రుచిగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచిగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ టమాటా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, టమాటాలు – 4, పచ్చిమిర్చి – సరిపడినంత, పసుపు – 1 టీ స్పూన్, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 4, కొత్తిమీర – చిన్న కట్ట, కరివేపాకు – ఒక రెబ్బ, చింతపండు – కొద్దిగా, జీలకర్ర – ఒక టీస్పూన్, ఆవాలు – ఒక టీస్పూన్, ఎండు మిర్చి ముక్కలు – 6, నూనె – సరిపడా.
స్పెషల్ టమాటా పప్పును తయారు చేసే విధానం..
ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పును కడిగి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటాలను ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ఒక కరివేపాకు రెబ్బ, చిటికెడు పసుపు, చింతపండు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అనంతరం మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత పప్పుకు పోపు పెట్టుకోవాలి.
స్టవ్ పై వేరే కడాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి బాగా వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆవాలు చిటపట అన్న తరువాత పోపులో అంతకు ముందు ఉడికించిన పప్పును వేయాలి. దీన్ని బాగా కలిపి 2 నిమిషాల పాటు మళ్లీ ఉడికించాలి. అంతే.. స్పెషల్ టమాటా పప్పు రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలతో తినవచ్చు. అందరూ ఇష్టపడతారు.