ఇటీవలి కాలంలో మహిళలపై హత్యాచారాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎంత సెక్యూరిటీ కల్పిస్తున్నా కూడా కొన్ని చోట్లు దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీస్ అధికారిణి టూరిస్ట్ అవతారమెత్తి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 33 ఏళ్ల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సుకన్య శర్మ సాధారణ దుస్తులు ధరించి ఆటోలో ప్రయాణించింది. ఆగ్రాలో రాత్రి వేళ మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు టూరిస్ట్ అవతారమెత్తారు. శనివారం అర్థ రాత్రి వేళ ఆగ్రా కంటోన్‌మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నంబర్‌కు కాల్ చేశారు.
తాను నగరానికి కొత్తగా వచ్చానని, రాత్రి వేళ రోడ్లు నిర్మాణుష్యంగా ఉండటంతో భయపడుతున్నానని, పోలీస్ సహాయం కావాలని చెప్పారు. హెల్ప్‌లైన్ ఆపరేటర్ వెంటనే స్పందించి సురక్షిత ప్రాంతంలో ఉండాలని సుకన్య శర్మకు చెప్పారు. ఆమె ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా పెట్రోలింగ్ టీమ్ నుంచి ఆ పోలీస్ అధికారిణికి ఫోన్ రావడం, ఆమె కోసం తాము బయలుదేరి వస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఏసీపీ సుకన్య తాను ఎవరో తెలియజేశారు. అయితే తాను చేసిన తనిఖీలో వారు పాస్ అయినట్టు ఆమె తెలియజేశారు.
ఇక సుకన్య తాను ఎవరో చెప్పకుండా నగరంలో మహిళల భద్రత గురించి ఆటో డ్రైవర్‌ను ఎంక్వైరీ చేశారు. అప్పుడు అతను తన ఆటోని పోలీసులు తనిఖీ చేశారని అన్నాడు. ఇక సుకన్య చెప్పిన చోటుకి ఆటో డ్రైవర్ సురక్షితంగా తీసుకెళ్లడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏసీపీ సుకన్య శర్మ చర్యను ప్రశంసించారు. వాస్తవానికి మహిళల భద్రతకు సరైన మొదటి అడుగు ఇదేనని అందులో పేర్కొన్నారు.పలువురు నెటిజన్స్ సైతం సుకన్య చేసిన ఈ ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.