Sweet Rice : మనకు ఫంక్షన్స్ లో కనిపించే వంటకాల్లో జర్దా పులావ్ ఒకటి. ఈ పులావ్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగడంలో ఆశ్చర్యం లేదు. ఈ పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు సులభంగా చేసుకునేలా జర్దా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జర్దా పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక లీటర్, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 4, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, రెడ్ ఫుడ్ కలర్ – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నెయ్యి – అర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పెద్ద ముక్కలుగా తరిగిన బాదం పప్పు గిజంలు – 8, ఎండు ద్రాక్ష – పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ముప్పావు కప్పు, గులాబ్ జామున్ – 1, రసగుల్లా – 1, తరిగిన చెర్రీస్ – 6.
జర్దా పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే మసాలా దినుసులు వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత ఫుడ్ కలర్, బాస్మతీ బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని పెద్ద మంటపై 80 శాతం అయ్యే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి అన్నాన్ని వడకట్టుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను, ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి.
ఇప్పుడు అదే కళాయితో ముందుగా అన్నాన్ని వేయాలి. అన్నం వేసిన తరువాత దానిపై పావు కప్పు పంచదార వేయాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కొద్దిగా చల్లుకోవాలి. తరువాత వాటిపై మరికొద్దిగా అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మరలా పావు కప్పు పంచదార, మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తరువాత మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి. తరువాత మరో పావు కప్పు, మిగిలిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి. తరువాత గులాబ్ జామున్ ను, రసగుల్లాను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత చెర్రీ ముక్కలను వేసుకోవాలి. ఇలా మూడు భాగాలుగా వేసిన తరువాత ఆవిరి బయటకు పోకుండా వాటిపై టిష్యూ పేపర్ లను ఉంచి కొద్దిగా నీటిని చల్లాలి.
ఇప్పుడు మూత పెట్టి 6 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై, 7 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత 15 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలి. 15 నిమిషాల తరువాత మూత తీసి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జర్దా పులావ్ తయారవుతుంది. ఈ పులావ్ తియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పులావ్ మూడు నుండి నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటుంది. స్పెషల్ డేస్ లో, వీకెండ్స్ లో ఈ విధంగా జర్దా పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు.