Eyes : మనిషి పుట్టుక, మరణం.. ఈ రెండూ కూడా మనిషి చేతుల్లో ఉండవు. ఏ మనిషి ఎప్పుడు పుడతాడో తెలియదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఈ రెండింటినీ ఎవరూ అంచనా వేయలేరు. అయితే పుట్టుక గురించి పక్కన పెడితే.. మరణం గురించి మాత్రం ముందుగానే తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అవును.. కళ్లను చూసి మనం ఎప్పుడు చనిపోతామో వారు చెప్పేస్తారట. ఇందుకు గాను కొందరు సైంటిస్టులు ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు కూడా చేశారు. చివరకు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన కళ్లలో రెటీనా అని ఒక పొర ఉంటుందన్న విషయం విదితమే. ఈ పొర మనకు కంటి చూపును అందిస్తుంది. అయితే వయస్సు మీద పడుతున్న కొద్దీ రెటీనా పొర క్షీణిస్తుంటుంది. అందుకనే వృద్ధాప్యం వచ్చే వరకు కళ్లు సరిగ్గా కనిపించవు. అయితే ఈ రెటీనా పొరను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడు.. ఎప్పుడు చనిపోతాడు.. అనే విషయాన్ని నిర్దారించవచ్చట. ఈ క్రమంలోనే సైంటిస్టులు 11 ఏళ్ల పాటు ఏకంగా 46,969 మంది కళ్లను పరీక్షించారు. వీరందరూ 40 నుంచి 69 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారు కావడం విశేషం. ఇక ఈ అధ్యయనం ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి.
మన శరీరానికి వయస్సు ఉన్నట్లుగానే మన కళ్లలోని రెటీనా పొరకు కూడా వయస్సు ఉంటుందట. అవును. రెటీనా పొరను అధ్యయనం చేసి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చట. ఈ క్రమంలోనే మన అసలు వయస్సు, రెటీనా పొర వయస్సు వేర్వేరుగా ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. రెటీనా పొర వయస్సు ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత త్వరగా చనిపోతారని అర్థం. రెటీనా పొర వయస్సు ఎంత తక్కువగా ఉంటే వారు అంత ఎక్కువ కాలం జీవిస్తారని అర్థం. రెటీనా పొర వయస్సు అసలు వయస్సు కన్నా 10 ఏళ్లు ఎక్కువగా ఉంటే వారు త్వరగా చనిపోతారట. ఇలాంటి వారు అధ్యయనంలో మొత్తం 50 శాతం వరకు ఉన్నారని వెల్లడైంది.
ఇక అసలు వయస్సుకు, రెటీనా వయస్సుకు మధ్య వ్యత్యాసం 5 ఏళ్లు ఉన్నవారు 28 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. అంటే వీరు త్వరగానే చనిపోతారు. కానీ కొంత కాలం జీవిస్తారన్నమాట. ఇక అసలు వయస్సు, రెటీనా వయస్సు మధ్య 3 ఏళ్లు వ్యత్యాసం ఉన్నవారు కూడా ఉన్నారు. వీరు ఎక్కువ కాలం జీవిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా రెటీనా వయస్సు ఆధారంగా ఒక వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు.. అనే విషయాన్ని నిర్దారించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు.