Tamarind Leaves Chutney : మనం చింతచిగురును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చింతచిగురు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురుతో చేసే వంటకాలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చింతచిగురుతో నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చింతచిగురు పచ్చడి కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరతాయని చెప్పవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే చింతచిగురు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతచిగురు – ఒక పెద్ద కప్పు, నూనె – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 6 లేదా తగినన్ని, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 3.
చింత చిగురు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో చింతచిగురు వేసి 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ముందుగా జార్ లో ఎండుమిర్చి, పల్లీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతచిగురు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిని ఇలాగే తినవచ్చు లేదా తాళింపు వేసుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతచిగురు పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారాలతో కడా ఈ పచ్చడిని తినవచ్చు.