Tawa Pulao : తవా పులావ్ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూస్తే.. మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..

Tawa Pulao : త‌వా పులావ్.. అన్నంతో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ఇది ఒక‌టి. త‌వా పులావ్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. వంట ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా త‌వా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని బ్యాచిల‌ర్స్ కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే త‌వా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

త‌వా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టీ స్పూన్స్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, క్యాప్సికం త‌రుగు – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – 100 గ్రా., అన్నం – ఒక క‌ప్పు బాస్మ‌తీ బియ్యంతో ఉడికించినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Tawa Pulao recipe in telugu tasty dish very easy to make
Tawa Pulao

తవా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె, బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యాప్సికం త‌రుగు, ప‌చ్చి బ‌ఠాణీ వేసి బ‌ఠాణీ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.బ‌ఠాణీ మెత్త‌గా అయిన త‌రువాత అన్నం వేసి క‌ల‌పాలి. అంతా క‌లిసేలా బాగా క‌లిపిన త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే త‌వా పులావ్ త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. బాస్మ‌తీ బియ్యంతోనే కాకుండా సాధార‌ణ బియ్యంతో పాటు తిన‌గా మిగిలిన అన్నంతో కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts