Cabbage Masala Vada : క్యాబేజ్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె క్యాబేజ్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటితో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. చక్కగా వండాలే కానీ క్యాబేజ్ తో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం కూరలే కాకుండా మనం క్యాబేజీతో చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజ్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో క్యాబేజ్ మసాలా వడ కూడా ఒకటి. మామూలు మసాలా వడ కంటే కూడా ఈ విధంగా క్యాబేజీ వేసి చేసిన మసాలా వడ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాబేజీతో మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజ్ – 1 ( చిన్నది), నాలుగు గంటల పాటు నానబెట్టిన శనగపప్పు – ముప్పావు కప్పు, అల్లం తరుగు – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, బియ్యం పిండి – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్యాబేజ్ మసాలా వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత క్యాబేజ్ ను లేయర్స్ గా చేసుకుని వేసుకోవాలి. ఈ క్యాబేజ్ ను మూడు నిమిషాల పాటు ఉడికించి జల్లిగిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిపై చల్లటి నీటిని పోసి నీళ్లు అన్నీ పోయేలా పక్కకు ఉంచాలి. తరువాత ఈ క్యాబేజ్ లేయర్స్ ను ఒక దాని మీద ఒకటి ఉంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత నానబెట్టిన శనగపప్పు నుండి పావు కప్పు శనగపప్పు తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన శనగపప్పును నీళ్లు లేకుండా చేసుకుని జార్ లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన క్యాబేజ్, మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమంను తీసుకోవాలి. తరువాత ఇందులో పక్కకు ఉంచిన శనగపప్పుతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. దీనిలో అవసరమైతే ఒక టీ స్పూన్ నీళ్లు వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
తరువాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ మసాలా వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్, పల్లి చట్నీ, టమాట చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మళ్లీ కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు. క్యాబేజ్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ గా తినడానికి ఈ క్యాబేజీ మసాలా వడలు చక్కగా ఉంటాయి.