Telangana Style Tomato Charu : మనం టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట చారు కూడా ఒకటి. టమాట చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు కూడా టమాట చారును ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ టమాట చారును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల టమాట చారు చిక్కగా ఉండడంతో పాటు మరింత రుచిగా ఉంటాయి. తెలంగాణా స్లైల్ లో టమాట చారును మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 3, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – ఒక గ్లాస్, వేయించిన నువ్వుల పొడి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత,ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
టమాట చారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో టమాట ముక్కలు, చింతపండు, నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టమాట ముక్కలను,చింతపండును జార్ లోకి తీసుకుని మిగిలిన నీటిని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఈ టమాట ముక్కలను మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లెడలో వేసి వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన టమాట ఫ్యూరీని టమాటాలు ఉడికించిన నీటిలో వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న టమాట రసం, మరో రెండు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఈ చారును 5 నిమిషాల పాటు పాటు మరిగించిన తరువాత నువ్వుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చారు తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.