వినోదం

Chiranjeevi : ఇంగ్లిష్‌లోకి డబ్బింగ్‌ అయిన చిరంజీవి మూవీ.. 4 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది..!

Chiranjeevi : కౌబాయ్ సినిమా అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు మూవీ. ఈ మూవీ తెలుగులో తొలి కౌబాయ్ సినిమా. ఇలా కృష్ణ అప్ప‌ట్లో తొలిసారిగా ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, క‌ల‌ర్‌ను కూడా ఆయ‌నే మొద‌ట‌గా ప‌రిచ‌యం చేశారు. అయితే కౌబాయ్ సినిమా అంటే మ‌న‌కు ముందుగా కృష్ణ‌నే గుర్తుకు వ‌స్తారు. త‌రువాత చిరంజీవి న‌టించి కొద‌మ సింహం మూవీ గుర్తుకు వ‌స్తుంది. ఈ మూవీ అప్ప‌ట్లో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. కౌబాయ్ సినిమా అంటే ఇలాగే ఉండాల‌ని చాటి చెప్పింది.

వాస్త‌వానికి కొద‌మ సింహం చేసే స‌మ‌యంలో చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నారు. ఆయ‌న అప్ప‌టికే కొండ‌వీటి దొంగ‌, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొద‌మ సింహంకు చాలా టైమ్ కేటాయించారు. అప్పట్లో ఆయ‌న మూవీ తీసేందుకు గ‌రిష్టంగా 2 నెల‌లు ప‌డితే కొద‌మ సింహంకు అంత‌కన్నా రెట్టింపు స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఎట్ట‌కేల‌కు సినిమా పూర్త‌యింది. కొద‌మ సింహం సినిమాకు స‌త్యానంద్ డైలాగ్స్ రాయ‌గా.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స్ర్కీన్ ప్లే అందించారు. నిర్మాత నాగేశ్వ‌ర్ రావు ఈ మూవీని నిర్మించ‌గా.. ద‌ర్శ‌కుడు ముర‌ళీ మోహ‌న్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో రాధ‌, వాణీ విశ్వ‌నాథ్ లతోపాటు సోన‌మ్ అనే హిందీ న‌టి కూడా యాక్ట్ చేసింది. అలాగే కైకాల స‌త్య‌నారాయ‌ణ, మోహ‌న్‌బాబు, గొళ్ల‌పూడి, క‌న్న‌డ ప్ర‌భాక‌ర్‌, ప్రాణ్ (హిందీ) లు ఇందులో కీల‌క‌పాత్ర‌లు పోషించారు.

this chiranjeevi movie dubbed into english

కొద‌మ సింహం మూవీ షూటింగ్‌ను 5 రాష్ట్రాల్లో చేశారు. ఇందులో హార్స్ రైడింగ్ కోసం చిరంజీవి అప్ప‌ట్లో రాజ‌స్థాన్‌లో గుర్ర‌పు స్వారీ నేర్చుకున్నారు. చెంగల్‌ప‌ట్టులో కౌబాయ్ సెట్ వేశారు. అందులో 7 రోజుల పాటు షూటింగ్ సాగింది. 1989 సెప్టెంబ‌ర్ 21న ప్రారంభ‌మైన షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ మూవీలో మెగాస్టార్‌తో ప్ర‌భుదేవా స్టెప్పులేయించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే మూవీలోని పిల్లో జాబిల్లో.., ఘుం ఘుమాయించు కొంచెం.., చ‌క్కిలి గింత‌ల రాగం.., జ‌పం జ‌పం కొంగ జ‌పం.. అనే పాట‌లు బంప‌ర్ హిట్ అయ్యాయి. ఎక్క‌డ చూసినా ఈ పాట‌ల‌నే వినేవారు. ఇక ఈ మూవీ తీసేందుకు అప్ప‌ట్లో రూ.3.50 కోట్లు ఖ‌ర్చు కాగా అంత‌కన్నా ఎక్కువ‌గానే భారీ మొత్తంలో ఈ మూవీ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ షూటింగ్‌ను ఎట్ట‌కేల‌కు పూర్తి చేశారు. అడ‌వుల్లో చ‌లికి వ‌ణుకుతూ, ఎండ‌కు ఎండుతూ క‌ష్ట‌ప‌డి సినిమా తీశారు. 1990, జూలైలో ఆడియో విడుద‌ల కాగా పాట‌లు సూప‌ర్ హిట్ అయ్యాయి. 1990, ఆగ‌స్టు 9వ తేదీన మూవీ విడుద‌లైంది. అప్ప‌టికే కొండ‌వీటి దొంగ‌, జ‌గ‌దేక వీరుడు సినిమాలు హిట్ అయి ఉండ‌డం.. కౌబాయ్-నిధి స్టోరీ కావ‌డం.. పాటలు, డ్యాన్స్‌లు.. క‌థ.. మ్యూజిక్‌.. వంటి అనేక అంశాల వ‌ల్ల కొద‌మ సింహం ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ సినిమాలో చిరంజీవి తాగిన సిగ‌రెట్ బ్రాండ్‌కు అప్ప‌ట్లో తెగ డిమాండ్ కూడా ఏర్ప‌డింది. ఇక ఇందులో మోహ‌న్ బాబు విల‌న్ పాత్ర‌లో సుడిగాలి క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఆయ‌న పాత్ర‌ను ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు గుర్తు చేసుకుంటారు. ఇది చిరంజీవితో ఆయ‌న‌కు చివ‌రి చిత్రం కావ‌డం విశేషం. ఇక సినిమాకు ప‌నిచేసిన రాజ్ కోటి ఈ మూవీకి గాను సంగీతం కోసం అధునాత‌న వాయిద్య ప‌రిక‌రాలను అప్ప‌ట్లో తెప్పించారు. దీంతో ఈ మూవీ పాట‌లు హిట్ అయ్యాయి. ఇక కొద‌మ సింహం మూవీ మొద‌టి వార‌మే భారీ స్థాయిలో క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. తొలి వారం ఈ మూవీ రూ.1.20 కోట్ల గ్రాస్ సాధించ‌గా.. నైజాంలో 44 థియేట‌ర్ల‌లో రూ.30 ల‌క్ష‌ల గ్రాస్ సాధించింది. జంట న‌గ‌రాల్లో 30 థియేట‌ర్ల‌లో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఈ మూవీ 16 కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌గా.. 4 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.

అయితే ఈ మూవీ 100 రోజుల వేడుక‌ను అప్ప‌ట్లో చెన్నైలోని తాజ్ హోట‌ల్‌లో నిర్వ‌హించ‌గా.. ఈ కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీకాంత్‌, వెంక‌టేష్‌లు ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. ఈ వేడుక‌లో ర‌జనీకాంత్ మాట్లాడుతూ.. సూప‌ర్ స్టార్ తాను కాద‌ని.. చిరంజీవి అని పొగిడారు. ఇక కొద‌మ సింహం సినిమాను హంట‌ర్స్ ఆఫ్ ది ఇండియ‌న్ ట్రెజ‌ర్ అనే పేరిట ఇంగ్లిష్‌లోకి డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇలా ఇంగ్లిష్‌లోకి రిలీజైన రెండో కౌబాయ్ సినిమా కొద‌మ సింహం కావ‌డం విశేషం. మొద‌టి సినిమా కృష్ణ న‌టించిన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు. అయితే కొద‌మ సింహం సినిమాను రామ్ చ‌ర‌ణ్‌తో రీమేక్ చేయాల‌ని చూస్తున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

Admin

Recent Posts