Thotakura Pachadi : మనం తోటకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తోటకూరను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. తోటకూరతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తోటకూరతో మనం ఎక్కువగా వేపుడు, పప్పు వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోటకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూరతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తోటకూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – 4 కట్టలు, తరిగిన పుదీనా – ఒక కట్ట, ఎండుమిర్చి – 20, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
తోటకూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో తరిగిన తోటకూర, పుదీనా వేసి వేయించాలి. తోటకూరలోని నీరు అంతా పోయి చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించిన దినుసులను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే జార్ లో వేయించిన తోటకూర, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. ఈ పచ్చడిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి చల్లారిన తరువాత గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయాలి. ఇలా నిల్వ చేయడం వల్ల పచ్చడి నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.