Tollywood : సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. పవన్ వ్యాఖ్యలతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిన టాలీవుడ్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని.. తమకు వాటితో సంబంధం లేదని చెప్పారు.
అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్‌పై కనికరించలేదు. సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరలను తగ్గిస్తూనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలుమార్లు చిరంజీవి జగన్‌ను కలిసి సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి పలువురు హీరోలతో కలిసి మళ్లీ జగన్‌ను కలిశారు. దీంతో జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించింది. ఇప్పటికిప్పుడు కొత్త జీవోను విడుదల చేయకపోయినా.. త్వరలో నూతన జీవోను విడుదల చేస్తామని.. దీంతో ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మొత్తం ఆ జీవో కోసం ఎదురు చూస్తోంది. ఈ నెల చివర్లో ఆ జీవోను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు కనుక.. కచ్చితంగా కొత్త జీవో రేపో, ఎల్లుండో వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. కానీ ఈ నెల 20వ తేదీని తలచుకుని టాలీవుడ్ పెద్దలు గుబులు పడుతున్నారు. ఆ తేదీ వారికి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఆ తేదీన పవన్ కల్యాణ్ నరసాపురంలో భారీ బహిరంగ పెట్టారు. దీంతో ఆ సభలో పవన్ ఏం మాట్లాడతారు ? రాజకీయాలు అయితే ఓకే. కానీ మళ్లీ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడినట్లు ఇండస్ట్రీపై, ఏపీ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎలా ? అప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది, తాము ఇంతా చేసి వృథా అవుతుందని.. టాలీవుడ్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 20వ తేదీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఆ తేదీ రోజున పవన్ ఏం మాట్లాడుతారు ? అన్నదాని గురించే చర్చ నడుస్తోంది. ఆ సభ సాఫీగా సాగిపోతే టాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటాయి. దీంతో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలపై మళ్లీ కొత్త జీవోను విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా పవన్ ఏమైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. మరి ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి.