Vankaya Bajji : మనం రకకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనకు బయట ఎక్కువగా లభించడంతో పాటు ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మన రుచికి తగినట్టు మనం రకరకాల రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే వంకాయలతో కూడా మనం బజ్జీలను తయారు చేసుకోవచ్చు. వంకాయ బజ్జీలను తయారు చేయడం చాలా తేలిక. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయలతో రుచిగా బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగు వంకాయలు – అర కిలో, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, వాము – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, చింతపండు రసం – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వంకాయ బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో బియ్యం పిండి, తగినంత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత చింతపండు గుజ్జులో కొద్దిగా ఉప్పు, కారం, వాము, ధనియాల పొడి వేసి అన్నీ కలిసేలా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను తొడిమలతో సహా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటికి చాకుతో నిలువుగా సగానికి గాటు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను వేసి ఎర్రగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కాల్చుకున్న వంకాయలు చల్లారిన తరువాత వాటిని ముందుగా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమంతో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనెను మరలా వేడి చేసుకోవాలి.
నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న వంకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ బజ్జీలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జీలు తయారవుతాయి. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు స్నాక్స్ గా ఇలా బజ్జీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎన్ని తిన్నారో తెలియకుండా ఈ బజ్జీలను అందరూ ఇష్టంగా తింటారు.