Vankaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయలలాగా వంకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వంకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం పలు రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత వంకాయలు – పావు కిలో, తరిగిన పచ్చి మిర్చి – 2, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, సోంపు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1 ( పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – 100 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా వంకాయలను తీసుకుని నాలుగు ముక్కలుగా కోసి ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. తరువాత ఒక కళాయిలో నూను వేసి నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఆమ్ చూర్ పొడి, సోంపు, జీలకర్ర పొడి వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
టమాట ముక్కలు ఉడికిన తరువాత వంకాయ ముక్కలను, తగినంత ఉప్పును వేసి మూత పెట్టి వంకాయలను పూర్తిగా ఉడికించుకోవాలి. వంకాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయ ముక్కలు ఉడికిన తరువాత గరంమసాలాను వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయవేపుడు తయారవుతుంది. ఇలా చేసుకున్న వంకాయ వేపుడును అన్నం లేదా చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.