Instant Atukula Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార పదార్థాలలో ఇడ్లీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టపడతారు. వీటి తయారీలో మనం మినప పప్పును ఉపయోగిస్తూ ఉంటాం.చట్నీ, సాంబార్ లతో కలిపి తింటే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయని మనందరికీ తెలుసు. ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించినట్టు వీటి తయారీలో మనం నూనెను ఉపయోగించం. కనుక ఇవి మన ఆరోగ్యానికి మంచివనే చెప్పవచ్చు. ఇడ్లీలను తయారు చేయడం సలుభమే కానీ ఇడ్లీ పిండిని మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇడ్లీ పిండిని తయారు చేసి పులియబెట్టేంత సమయం లేని వారు కూడా చాలా మందే ఉంటారు. మినప పప్పుతో తయారు చేసిన ఇడ్లీ పిండి లేకున్నా కూడా అప్పటికప్పుడు ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఇడ్లీలను మనం తయారు చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీలను తయారు చేసుకోవడానికి మనం అటుకులను ఉపయోగించాల్సి ఉంటుంది. అటుకులతో రుచిగా ఉండే ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టంట్ అటుకుల ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, పెరుగు – రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
ఇన్ స్టంట్ అటుకుల ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను, ఒక కప్పు పెరుగును వేసి బాగా కలిపి అటుకులు పూర్తి మెత్తబడే వరకు ఉంచాలి. అటుకులు మెత్తగా అయిన తరువాత ఒక జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మరో కప్పు పెరుగును, ఇడ్లీ రవ్వను, ఉప్పును, వంటసోడాను వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఇడ్లీని తయారు చేసుకునే ప్లేట్ లలో వేసి పాత్రలో ఉంచి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు కదలించకుండా ఉంచి ఆ తరువాత ఇడ్లీలను బయటకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు ఎంతో రుచిగా, మెత్తగా ఉండే అటుకుల ఇడ్లీలు తయారవుతాయి. వీటిని టమాట చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, వెల్లుల్లి కారం, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.