Vellulli Pulusu : వెల్లుల్లి పులుసు.. వెల్లుల్లి రెబ్బలతో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి పులుసును తయారు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోనే ఈ పులుసును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పులుసును సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పొట్టు తీసి దంచిన వెల్లుల్లి రెమ్మలు – 20, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, మెంతులు – చిటికెడు, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్.
వెల్లుల్లి పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత చింతపండు పులుసు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. పులుసు చిక్కబడి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పులుసు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, ఆమ్లెట్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వెల్లుల్లి పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.