Venkatesh : జాతి రత్నాలు సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ కె.వి.. గతే ఏడాది మార్చిలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో అందరి చూపు అనుదీప్ తదుపరి చిత్రంపై పడింది. ప్రస్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ తో ఓ బైలింగువల్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానుంది. థియేటర్లలో ఈ ఏడాదే ఈ సినిమా సందడి చేసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా అనుదీప్ తదుపరి చిత్రంపై టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్ ఓ సీనియర్ హీరోతో సినిమా చేయనున్నాడని పుకార్లు వస్తున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ తో అనుదీప్ సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.
ఈ మూవీ కాంబోపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. కాగా విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మే 27, 2022 న ఎఫ్ 3 విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌లో వెంకటేశ్ నటిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.