Soundarya : తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణను పొందింది. ఈమె 12 ఏళ్ల తన సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. భారతీయ భాషలకు చెందిన అనేక సినిమాల్లో నటించిన సౌందర్య జూనియర్ సావిత్రిగా పేరుగాంచింది. ఈమె అసలు పేరు సౌమ్య. బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తుండగా.. ఈమెకు 1992లో గంధర్వ అనే చిత్రంలో నటించేందుకు అవకాశం లభించింది. దీంతో ఆమె చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా ఆమెకు అప్పట్లో అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్‌గా పేరుగాంచింది. కన్నడ, తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషలకు చెందిన చిత్రాల్లో ఈమె నటించింది. ఇక హిందీలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి సూర్యవంశ్ అనే మూవీలో నటించింది.
సౌందర్య.. గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతోపాటు పలు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా చిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది. కాగా సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. అప్పట్లో ఆమె బీజేపీలో చేరింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ రావల్సి ఉంది. అప్పట్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ నుంచి సీహెచ్ విద్యాసాగర్ రావు బరిలో ఉన్నారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం కోసం సౌందర్య బెంగళూరు నుంచి కరీంనగర్‌కు విమానంలో బయల్దేరింది. ఏప్రిల్ 17న బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయంలో తన సోదరుడు అమరనాథ్‌తో కలిసి ఆమె చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కింది. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులతోపాటు అమరనాథ్ భార్య, పిల్లలు ఉన్నారు. వారికి వారు వీడ్కోలు పలికారు. కానీ అదే వారికి చివరి వీడ్కోలు అవుతుందని ఊహించలేకపోయారు.
ఇక చార్టర్డ్ ఫ్లైట్‌లోకి ఎక్కగానే కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం కూలిపోయింది. పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణలో కుప్పకూలిపోయింది. అయితే విమానం కూలిన తరువాత ఆ శబ్దానికి అక్కడికి చేరుకున్న సిబ్బంది అందులో ఉన్నవారిని బయటకు తీయాలని భావించారు. సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్, ఇంకో ఇద్దరు ఏం జరిగింది.. అంటూ సహాయం కోసం అర్థించారు. అయితే సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే కింద పడిన విమానం మొత్తం మళ్లీ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అందులోని వారందరూ సజీవ దహనమయ్యారు. తరువాత 30 నిమిషాలకు గానీ వారు మంటలు ఆర్పలేకపోయారు. అనంతరం మృతదేహాలు గుర్తు పట్టరాని విధంగా ఉండడంతో వారి దుస్తులు, ఇతర ఆనవాళ్లతోపాటు డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృతదేహాలను గుర్తించారు.
కాగా సౌందర్య తాను నటించిన అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప, ఆప్తమిత్ర సినిమాలకు గాను ఫిలింఫేర్ పురస్కారాలను అందుకుంది. అలాగే ఆమె చనిపోయే నాటికే ఎన్నో అనాథాశ్రమాలను దత్తత తీసుకుని చిన్నారుల సంక్షేమాన్ని చూసింది. ఆమె చనిపోయాక 2009లో డిసెంబర్ 3వ తేదీన ఆమె ఆస్తిని అందరూ సమానంగా పంచుకోవాలని కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా వెండితెరపై ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ తార అర్థాంతరంగా నేలరాలింది. సౌందర్య అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉంటారు. ఆమె చనిపోయినా సినిమాల రూపంలో మాత్రం ఆమె బతికే ఉందని చెప్పవచ్చు.