Wheat Flour Halva : గోధుమ పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. అస‌లు ఏమీ మిగ‌ల్చ‌రు.. మొత్తం తినేస్తారు..

Wheat Flour Halva : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇవే కాకుండా మ‌నం గోధుమ పిండితో కూడా తహ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండితో హ‌ల్వా ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. గోధుమ పిండితో రుచిగా, సులువుగా హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ పిండి హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – ఒక క‌ప్పు, పంచ‌దార – ఒక క‌ప్పు, నెయ్యి – అర క‌ప్పు, వేయించిన జీడిప‌ప్పు – కొద్దిగా.

Wheat Flour Halva recipe in telugu perfect sweet
Wheat Flour Halva

గోధుమ‌పిండి మ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత పిండి మునిగే వ‌ర‌కు నీళ్లు పోసి 3 గంట‌ల పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి. మూడు గంట‌ల త‌రువాత పిండిని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత జ‌ల్లిగంటెతో ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టుకుని గోధుమ పిండి నుండి వ‌చ్చే పాల‌ను సేక‌రించాలి. త‌రువాత ఈ పాల‌పై మూత పెట్టి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నీళ్లు పైన పేరుకుంటాయి. ఈ నీళ్ల‌ను వంపేసి గోధుమ పాల‌ను ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో పంచ‌దార‌, అర గ్లాస్ నీళ్లను పోసి వేడి చేయాలి.

దీనిని పంచ‌దార క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. పంచ‌దార క‌రుగుతుండ‌గానే మ‌రో గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల పంచ‌దార‌ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను పోయాలి. పంచ‌దార క‌రిగి క్యార‌మెల్ లా అయ్యే వ‌ర‌కు వేడి చేస్తూనే ఉండాలి. పంచ‌దార క్యార‌మెల్ లా అయిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకుంటున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న గోధుమ పిండి పాల‌ను వేసి క‌లుపుతూ వేడి చేయాలి. కొద్ది స‌మ‌యం త‌రువాత ఈ మిశ్ర‌మం చిక్క‌బ‌డుతుంది. ఇలా చిక్క‌బ‌డిన త‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి క‌లుపుకోవాలి. ఇలా ప‌ది నిమిషాలకొక‌సారి నెయ్యిని వేసుకుంటూ క‌లుపుకుంటూ ఉండాలి.

కొద్ది సేప‌టి త‌రువాత హ‌ల్వా క‌ళాయికి అంటుకోకుండా వేర‌వుతుంది. ఇలా వేరైన‌ప్పుడు ఇందులో వేయించిన జీడిప‌ప్పును వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని నెయ్యి రాసిన ఒక గిన్నెలోకి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత దీనిని వేరే ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హ‌ల్వా త‌యారవుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా గోధుమ‌పిండితో హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ హ‌ల్వాను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts