Janthikalu : క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా.. జంతిక‌ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎంతో ఇష్టంగా తింటారు..

Janthikalu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో జంతిక‌లు కూడా ఒక‌టి. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అంతేకాకుండా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. జంతిక‌ల త‌యారీ విధానం మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సార్లు మ‌నం తయారు చేసే ఈ జంతిక‌లు గట్టిగా అవుతాయి లేదా మెత్త‌గా అవుతాయి. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చేయ‌లేని వారు కూడా ఉంటారు. ఈ జంతిక‌ల‌ను రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జంతిక‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – 2 క‌ప్పులు, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, వాము – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – పావు టీ స్పూన్, వెన్న – 2 టేబుల్ స్పూన్స్, గోరు వెచ్చ‌ని నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా.

you can make Janthikalu in this crunchy way
Janthikalu

జంతిక‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని, శ‌న‌గ పిండిని తీసుకోవాలి. త‌రువాత‌ ఇందులోనే ప‌సుపు, కారం, వాము, ఉప్పు, వంట‌సోడా వేసి అన్నీ క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత వెన్న‌ను వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ గంటెతో క‌లుపుకోవాలి. పిండి చ‌ల్లారిన త‌రువాత చేత్తో బాగా క‌లుపుకోవాలి. పిండి మ‌రీ గట్టిగా, మ‌రీ మెత్త‌గా కాకుండా క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న పిండిపై త‌డి వ‌స్త్రాన్ని ఉంచి 15 నిమిషాల పాటు నాన‌బెట్టాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. త‌రువాత జంతికల అచ్చును తీసుకుని దానికి లోప‌ల పిండి అతుక్కుపోకుండా నూనెను రాయాలి. త‌రువాత ఇందులో త‌గినంత పిండిని ఉంచి జంతిక‌ల‌ను నేరుగా నూనెలో వ‌త్తుకోవాలి. నేరుగా నూనెలో జంతిక‌ల‌ను వ‌త్త‌డం రాని వారు ఒక ప్లేట్ కు నూనె రాసి దాని పై జంతిక‌ల‌ను వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ జంతిక‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే జంతిక‌లు త‌యార‌వుతాయి.

జంతిక‌ల‌ను ఎక్కువ స‌మ‌యం నూనెలో ఉంచితే అవి గ‌ట్టిగా త‌యార‌వుతాయి. క‌నుక అవి రంగు మార‌గానే నూనె నుండి బ‌య‌ట‌కు తీయాలి. అలాగే జంతిక‌లు మ‌రీ లావుగా ఉన్నా కూడా మెత్త‌గా ఉంటాయి. క‌నుక జంతిక‌లు మ‌రీ లావుగా లేకుండా చూసుకోవాలి. బ‌యట దొరికే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే రుచిగా జంతిక‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా త‌యారు చేసిన జంతిక‌లను అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts