Coins : సాధారణంగా చాలా మంది యువత బైక్‌లు అంటే ఇష్టపడుతుంటారు. స్పోర్ట్స్ బైక్‌ను కొని దానిపై తిరగాలని వారికి ఆశ ఉంటుంది. అయితే కొందరు మాత్రమే ఈ కలను నిజం చేసుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ కష్టపడితే ఎవరైనా సరే తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చని ఆ యువకుడు నిరూపించాడు. తాను ఎంతో కష్టపడి పోగు చేసిన డబ్బుతో ఎట్టకేలకు తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్ బైక్‌ను కొన్నాడు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని సేలంలో ఉన్న అమ్మపేటలోని గాంధీ మైదాన్‌కు చెందిన వి.భూపతి (29) స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే జీతం అంతంత మాత్రమే. అయితే అతనికి బజాజ్ కంపెనీకి చెందిన డోమినార్ 400 బైక్‌ను కొనాలని కోరిక ఉండేది. 3 ఏళ్ల కిందటే ఈ బైక్ గురించి అడిగితే దాని ధర రూ.2 లక్షలు చెప్పారు. కానీ భూపతి వద్ద అంత డబ్బు లేదు. దీంతో ఎలాగైనా సరే తన డ్రీమ్ బైక్‌ను కొనుగోలు చేయాలని భూపతి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే తాను కష్టపడి సంపాదించే దాంట్లో నుంచి కొంత డబ్బును బైక్ కొనడం కోసం పొదుపు చేయసాగాడు. అలాగే యూట్యూబ్ చానల్‌ను కూడా పెట్టి దాంతోనూ డబ్బు సంపాదించసాగాడు.
ఇక తాజాగా అతను మళ్లీ బైక్ షోరూంకు వెళ్లి దాని ధర అడగ్గా.. రూ.2.60 లక్షలు చెప్పారు. అయితే తన వద్ద అంత డబ్బూ ఉంది. దీంతో బైక్ ను కొనాలని అనుకున్నాడు. ఒక వ్యాన్‌లో తాను పోగు చేసిన రూ.1 నాణేలను వేసుకుని వచ్చాడు. అవి రూ.2.60 లక్షలు ఉంటాయి. అయితే షోరూం వారు ఆ నాణేలను తీసుకునేందుకు ముందుగా విముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే వాటిని కౌంట్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే బ్యాంకులో ఆ నాణేలను డిపాజిట్ చేస్తే కౌంటింగ్ కోసం రూ.1 లక్షకు రూ.140 చార్జి వసూలు చేస్తారు. ఇదంతా తలనొప్పి ఎందుకని ముందుగా షోరూం వారు అతను తెచ్చిన నాణేలను తీసుకునేందుకు నిరాకరించారు. కానీ అతని కథ తెలిసి చివరకు ఒప్పుకున్నారు. దీంతో అతను తన డ్రీమ్ బైక్‌ను ఎట్టకేలకు కొనగలిగాడు.
అయితే ఉదయం 9 గంటలకు నాణేలతో షోరూంకు వెళితే అతను రాత్రి 9 గంటలకు బైక్‌ను డెలివరీ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే నాణేలను లెక్కించడానికి సుమారుగా 10 గంటలకు పైగానే సమయం పట్టింది. ఇక మొత్తం రూ.2.60 లక్షల నాణేలను తన నలుగురు స్నేహితులతోపాటు షోరూం సిబ్బంది 5 మంది కష్టపడి లెక్కించారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు తన డ్రీమ్ బైక్‌ను కొన్నందుకు భూపతి పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు.