Almonds And Sesame Seeds : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో క్యాల్షియం ఒకటి. శరీరంలో తగినంత క్యాల్షియం ఉండడం చాలా అవసరం. దంతాలను, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువును నియంత్రణలో ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తంలో పిహెచ్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో క్యాల్షియం మనకు ఎంతగానో అవసరమవుతుంది. అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్ బారిన పడకుండా చేయడంలో, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తం గడ్డకట్టేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా క్యాల్షియం మనకు అవసరమవుతుంది.
కానీ ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది శరీరంలో క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోని వారిలో, వయుసు పై బడిన వారిలో, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో, బాలింతలల్లో, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారిలో, ఆల్కాహాల్ ను ఎక్కువగా సేవించే వారిలో, కాఫీ ఎక్కువగా తాగే వారిలో, థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో, అలాగే విటమిన్ డి, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఇతర పోషకాల లోపంతో బాధపడే వారిలో క్యాల్షియం లోపం ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది. క్యాల్షియం లోపించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల ఛాతిలో నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడిచేటప్పుడు శబ్దాలు రావడం, తలతిరిగినట్టు ఉండడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు తలెత్తడం, ఆందోళన, దంతాల నొప్పులు, అరి చేతులు మరియు అరికాళ్లల్లో గుచ్చినట్టు ఉండడం, చర్మం పొడి బారడం, గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలడం వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మన శరీరంలో తగినంత క్యాల్షియం ఉండడం చాలా అవసరం. చాలా మంది క్యాల్షియం లోపాన్ని అధిగమించడానికి క్యాల్షియం క్యాప్సుల్స్ ను వాడుతూ ఉంటారు. క్యాప్సుల్స్ ను వాడే అవసరం లేకుండా కేవలం మనం తీసుకునే ఆహారాల ద్వారానే మనం తగినంత క్యాల్షియాన్ని పొందవచ్చు.
రోజూ నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసుకుని తిని వెంటనే ఒక గ్లాస్ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. అలాగే నువ్వులను పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో కలిపి తాగాలి. క్యాల్షియం లోపం ఎక్కువగా ఉన్నవారు ఈ నువ్వుల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాలి. అలాగే పాల పదార్థాలను, సోయా టోఫును, బ్రకోలిని, పాలకూరను, నారింజ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనం క్యాల్షియం లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.