Allam Rasam : ఘుమ‌ఘుమ‌లాడే అల్లం ర‌సం.. ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Allam Rasam : మ‌నం వంట‌ల్లో అల్లాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అల్లాన్ని పేస్ట్ గా చేసి ఎక్కువ‌గా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో వాడ‌డంతో పాటు అల్లంతో ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్లం రుచిగా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. దీనిని కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఘాటుగా, ఎంతో రుచిగా ఉండే అల్లం ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాట – 1, ఉడికించిన కందిప‌ప్పు – అర క‌ప్పు, క‌చ్చా ప‌చ్చాగా దంచిన అల్లం – రెండు ఇంచుల ముక్క‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతి గింజ‌లు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – రెండు గ్లాసులు, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్ , ఎండు కొబ్బ‌రి తురుము – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – త‌గినంత‌.

Allam Rasam recipe do like this tastes better
Allam Rasam

అల్లం ర‌సం త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు, జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి, క‌రివేపాకు, ఇంగువ‌ వేసి వేయించాలి. త‌రువాత అల్లం, ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ప‌ప్పు వేసి క‌ల‌పాలి. తరువాత నీళ్లు, ఉప్పు, ప‌సుపు, చింత‌పండు ర‌సం, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ర‌సాన్ని 5 నుండి 8 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత కొబ్బ‌రి తురుము, కొత్తిమీర వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం ర‌సం త‌యార‌వుతుంది.

దీనిని వేడి వేడిగా అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు అల్లం ర‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్యల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ విధంగా అల్లంతో ర‌సాన్ని త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts