Finger Millets : పూర్వకాలంలో ఆహారంగా అనేక రకాల చిరు ధాన్యాలను తీసుకునే వారు. వాటిల్లో రాగులు కూడా ఒకటి. అయితే గత కొంతకాలంగా చాలా మంది వరిని పండించడంతోపాటు వరి ధాన్యాన్నే ఆహారంగా తీసుకుంటున్నారు. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం పూర్తిగా మానేశారు. దీంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ సమస్యల బారి నుండి బయటపడడానికి తిరిగి ప్రజలు చిరు ధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నారు. దీని కారణంగా రాగుల వాడకం మరలా ఎక్కువైందనే చెప్పవచ్చు.
రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులతో ఎటువంటి వంటకాన్ని చేసి తీసుకున్నా కూడా మనకు మేలే కలుగుతుంది. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. రాగి పిండితో జావను చేసుకుని తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గడంతోపాటు శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ రాగులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పోషకాహార లేమి సమస్య కూడా ఉండదు. రాగులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్రమంగా మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో రాగుల్లో అధికంగా ఉండే క్యాల్షియం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పిల్లలకు తరచూ రాగులతో చేసిన పదార్థాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రక్తపోటు సమస్యతో బాధపడే వారు అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు రాగులను తరచూ తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని, మానసిక ఆందోళనను తగ్గించి జీవక్రియలను సాఫీగా సాగేలా చేయడంలో కూడా రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఊబకాయం సమస్యతో బాధపడే వారు రాగులను తీసుకోవడం వల్ల ఆకలి అదుపులోకి వస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కూడా రాగులకు ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేయడంలో కూడా రాగులు మనకు దోహదపడతాయి.
రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బాలింతలల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. నీరసంగా ఉన్నప్పడు రాగులతో జావను చేసి తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ విధంగా రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.