Diabetes Food : ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలోని అన్ని అవయాలపై ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. షుగర్ వ్యాధి గ్రస్తులు కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. ఏది పడితే అది తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపు తప్పి షుగర్ వ్యాధి ఎక్కువవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా షుగర్ వ్యాధిని నియంత్రించే ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి రోజూ ఆహార నియమాలను పాటిస్తూ తగినంత నీటిని తాగడంతోపాటు వ్యాయామాలు కూడా చేయడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను నివారించవచ్చు. ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి గ్రస్తులు ఆహారంలో భాగంగా చిలగడ దుంపలను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. వీటినే కందగడ్డలు అని కూడా అంటారు.
చిలగడ దుంపల్లో ఫైబర్, పొటాషియం, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయి. డయాబెటిస్ ను నియంత్రించే ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. బీన్స్ లో ప్రోటీన్స్ తోపాటు కాల్షియం, మెగ్నిషియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే ఇతర పోషకాలు భోజనం తిన్న తరువాత జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి ఈ బీన్స్ ను సూప్, సలాడ్ లలో లేదా కూరగా చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అదేవిధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు పాలకూరను తీసుకోవడం వల్ల కూడా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక పాలకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న బెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతోపాటు షుగర్ వ్యాధి కూడా నియంత్రించబడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో, క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. కనుక బెర్రీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఆహారంలో భాగంగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇన్సులిన్ నిరోధకతను అడ్డుకోవడంతోపాటు డయాబెటిస్ ను నియంత్రించే గుణం కూడా దాల్చిన చెక్కలో ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో చిరు ధాన్యాలు కూడా ఒకటి. చిరు ధాన్యాల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చిరు ధాన్యాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధితోపాటు అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు తమ ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంతోపాటు అధిక రక్తపోటును కూడా ఇవి నియంత్రణలో ఉంచుతాయి. మంచి ఫలితాలను పొందాలంటే ఈ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రించడంలో మనకు ఆలివ్ నూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఆలివ్ నూనె మనకు ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ ను తగ్గించే వాటిల్లో పెరుగు కూడా ఒకటి. పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. డయాబెటిస్ ను తగ్గించడంలో పెరుగు యాక్టివ్ గా పని చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని మనం చాలా సులువుగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.