Pineapple : శారీరక శక్తిని పెంపొందించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈప్రయత్నాల వల్ల కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం తప్ప శారీరక దారుఢ్యాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాం. శారీరకంగా దృఢంగా మారాలంటే అది ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పండ్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. శారీరక దారుఢ్యాన్ని అందించే ముఖ్యమైన వాటిల్లో అనాస పండు ఒకటి. ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్యౌషధాల్లో అనేక పండ్లు, కూరగాయలు ఉన్నా వాటిల్లో పైనాపిల్ అని నిలిచే అనాస మాత్రం ప్రత్యేకమనే చెప్పవచ్చు.
వర్షాకాలంలో విరివిరిగా లభించే పండ్లల్లో పైనాపిల్ ఒకటి. పుల్లగా, తియ్యగా ఉండే పైనాపిల్ లో పొటాషియం, సోడియం, నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తాయి. అదే విధంగా పైనాపిల్ లో ఉండే విటమిన్ సి మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు మన దరి చేరకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు జీర్ణక్రియ సాఫీగా చేయడంలో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక పొట్ట సమస్యను నయం చేసే గుణం పైనాపిల్ లో అధికంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఒక గిన్నెలో పైనాపిల్ ముక్కలను, 5 లేదా 6 టీ స్పూన్ల వాము పొడిని వేసి బాగా కలపాలి. తరువాత వాటిల్లో ఒక గ్లాస్ నీటిని పోసి బాగా మరిగించాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే వడకట్టుకుని పరగడుపున తాగాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తాగడం వల్ల ఎంతటి పొట్టైనా కచ్చితంగా తగ్గుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం దీనిని తీసుకోకూడదు.
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ ను తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తల్లిపాలు తగినన్ని లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాస పండు రసం ఇస్తే చాలా మంచిది. పైనాపిల్ ముక్కలను తేనెలో 24 గంటల పాటు ఉంచిన తరువాత తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గు ముఖం పడుతుంది. ప్రేగుల్లో కదలికలు జరిగి విరేచనం సాఫీగా అవుతుంది. పైనాపిల్ వికారాన్ని తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. పండిన అనాస పండును తినడం వల్ల దంతాల నుండి రక్తం కారడం తగ్గుతుంది.
పచ్చి అనాస పండు రసాన్ని తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు నశిస్తాయి. జ్వరం, కామెర్ల వ్యాధితో బాధపడే వారికి అనాస పండు రసాన్ని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అనాస పండు ఆరోగ్యానికిమేలు చేస్తుందని మనందరికీ తెలుసు. కానీ అందచందాలను కూడా ఇరుమడింపచేసే శక్తి కూడా అనాస పండుకు ఉందని మనలో చాలా మందికి తెలియదు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా అనాస పండు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దనా చేయడం వల్ల ముఖం కోమలంగా మారుతుంది. చర్మంపై ఉండే మృత కణాలను, నల్లటి మచ్చలను కూడా అనాస పండును ఉపయోగించి తొలగించుకోవచ్చు. శరీరంలో వాపులను, నాసిక సంబంధిత సమస్యలను, టైఫాయిడ్ ను నయం చేసే గుణం కూడా అనాస పండుకు ఉంటుంది. బాగా పండిన అనాస పండు రసం శరీరతాపాన్ని తగ్గిస్తుంది. తగినంత శక్తిని కూడా అందిస్తుంది. ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థాలు మలబద్దకానికి మంచి మందులా పని చేస్తాయి. పచ్చి అనాన పండు రసాన్ని గాయాలపై రాయడం వల్ల గాయం నుండి రక్తం కారడం ఆగుతుంది.
పైనాపిల్ రసంలో పంచదారను కలిపి తీసుకోవడం వల్ల వేసవి కాలంలో వడదెబ్బ బారినపడకుండా ఉంటాం. గొంతునొప్పి, టాన్సిల్స్ వంటి వాటితో బాధపడే వారు అనాస పండ్ల రసాన్ని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని చర్మంపై పూతగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు క్రమంగా నయం అవుతాయి. అనాస పండ్ల రసాన్ని పచ్చ కామెర్లు, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా అనాస పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని, అనాస పండ్లను మనం కచ్చితంగా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.