Watermelons : వేసవికాలం వచ్చేసింది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే శరీరం శక్తి కోల్పోకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు నీటిని మాత్రమే తాగితే ఎలాంటి ఫలితం ఉండదు. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది తప్ప శరీరానికి శక్తిని అందించదు. కనుక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు శక్తిని అందించే పండ్లను, కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. వేసవికాలంలో ఎక్కువగా పుచ్చకాయ, మామిడిపండ్లు, పీచ్, కర్బూజ, కీరదోస వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో తగినంత నీరు ఉండడంతో పాటు ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే పుచ్చకాయలో సోడియం ఉండదు. అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో అధికంగా ఉండే విటమిన్ ఎ, లైకోపిన్ అనే రసాయన సమ్మేళనం కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వ్యాయామం చేసిన తరువాత తీసుకోవాల్సిన పండ్లల్లో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల వ్యాయామం చేసిన తరువాత కండరాలు పట్టుకుపోకుండా ఉంటాయి. అలాగే దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా పుచ్చకాయను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ వల్ల శరీరం కోల్సోయిన ఎలక్ట్రోలైట్ లు తిరిగి లభిస్తాయి. కనుక వేసవికాలంలో పుచ్చకాయను తీసుకోవడం వల్ల ఎండ వల్ల శరీరానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.