Tomato Vadiyalu : వేసవికాలం వచ్చిందంటే చాలు మనం రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని సంవత్సరమంతా నిల్వ చేసుకుంటూ ఉంటాం. మనం వివిధ రుచుల్లో ఈ వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో టమాట వడియాలు కూడా ఒకటి. టమాట వడియాలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఎంతో సులభంగా తయారు చేసుకునే ఈ టమాట వడియాల తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – పావు కిలో, అటుకులు – ఒకటిన్నర కప్పులు, నువ్వులు – పావు కప్పు, కారం – ఒకటిన్నర టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 3, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, కొత్తిమీర – ఒక చిన్న కట్ట.
టమాట వడియాల తయారీ విధానం..
ముందుగా నువ్వులను కడిగి నీళ్లు లేకుండా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే అటుకులను కూడా నానబెట్టి మెత్తగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జార్ లో టమాట ముక్కలు, కారం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నువ్వులతో పాటు నానబెట్టి మెత్తగా చేసుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని ప్లాస్టిక్ కవర్ మీద లేదా కాటన్ వస్త్రంపై వడియాలుగా పెట్టుకోవాలి.
వీటిని బాగా ఎండబెట్టి తరువాత డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట వడియాలు తయారవుతాయి. వీటిని నూనెలో వేయించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే వడియాలతో పాటు ఇలా టమాట వడియాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.