Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ ను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో సులభంగా తయారు చేసుకోగలిగిన చిరుతిళ్లల్లో స్వీట్ కార్న్ పకోడీ కూడా ఒకటి. ఈ పకోడీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. వీటిని నిమిషాల వ్యవధిలోనే మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా కరకరలాడుతూ ఉండేలా స్వీట్ కార్న్ తో పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – ఒక కప్పు, శనగపిండి – 3 టీ స్పూన్స్, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పుదీనా ఆకులు – 10,ఉప్పు -తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, గరం మసాలా – అర టీ స్పూన్.
స్వీట్ కార్న్ పకోడి తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ ను జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొన్ని నీటిని కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పకోడీ పిండిలా కలుపపుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్వీట్ కార్న్ మిశ్రమాన్ని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిన మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ తయారవుతుంది. వీటిని టమాట సాస్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా చేసుకుని సాయంత్రం సమయాల్లో వీటిని తినవచ్చు.