Anjeer : అంజీర్ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తున్నాయి. పండ్ల రూపంలో.. డ్రై ఫ్రూట్స్ రూపంలో వీటిని మనం కొనుగోలు చేయవచ్చు. పండ్ల రూపంలో ఉండేవాటిలో లోపలి గుజ్జు పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రూపం కారణంగా ఈ పండ్లను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను చాలా మంది తింటుంటారు. ఇక వీటితో పలు రకాల తియ్యని వంటకాలను సైతం చేస్తుంటారు. అయితే అంజీర్ పండ్లను మనం ఎలా తిన్నా సరే మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వేటిని అయినా సరే తక్కువ మోతాదులో తినాలని చెబుతుంటారు కదా. అలాగే ఈ పండ్లను కూడా మనం తక్కువగానే తినాలి. అధికంగా తింటే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అంజీర్ ను మోతాదుకు మించి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ పండ్లలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. కనుక వీటిని తక్కువగా తినాలి. అధికంగా తింటే వీటిలో ఉండే ఆగ్జలేట్స్ మన శరీరంలో ఉండే కాల్షియం మొత్తాన్ని శోషించుకుంటాయి. దీంతో మనలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. సులభంగా విరిగిపోతాయి. కనుక అంజీర్ పండ్లను మోతాదులోనే తినాల్సి ఉంటుంది. ఇక ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణం అయ్యేందుకు ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో ఈ పండ్లను అధికంగా తింటే అది అజీర్తి సమస్యకు దారి తీస్తుంది. ఫలితంగా గ్యాస్ వస్తుంది. కాబట్టి అంజీర్ పండ్లను అధికంగా తినరాదు.
అంజీర్ పండ్లలో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి కనుక కిడ్నీ స్టోన్స్, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తినాలి. లేదంటే స్టోన్స్ ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీ, మూత్రాశయ సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక అంజీర్‌ను మోతాదులోనే తినాలి. ఈ పండ్లు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని వేసవిలో తక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ పండ్లు త్వరగా జీర్ణం కావు కనుక అధికంగా తింటే ఆ ప్రభావం లివర్, పేగులపై పడేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక అంజీర్ పండ్లను ఎల్లప్పుడూ తగిన మోతాదులోనే తినాలి. దీంతో అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.