Orange : గర్భం ధరించిన స్త్రీలు పుష్టికరమైన ఆహారాన్ని, తాజా పండ్లను తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ పండు కూడా ఒకటి. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని కలిగి ఈ పండు తినడానికి ఎంతో వీలుగా ఉంటుంది. నారింజ పండును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ పండ్లను తొనల రూపంలో లేదా జ్యూస్ గా తీసుకున్నా కూడా శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ మార్కెట్ లో టెట్రా ప్యాక్ లలో దొరికే జ్యూస్ ను మాత్రం తాగకూడదు. అధిక ప్రయోజనాలను పొందాలంటే తాజాగా అప్పటికప్పుడు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగాలి. నారింజ పండ్లలో విటమిన్ సి తోపాటు ఐరన్, జింక్ వంటి మినరల్స్, ఫోలిక్ యాసిడ్ ఫుష్కలంగా ఉంటాయి. గర్భిణీలు వీటిని తినడం వల్ల గర్భస్థ శిశువులు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వారిలో రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది.
గర్భస్థ శిశువులలో ఎముకలు, కణజాలాలు చక్కగా ఏర్పడడంలో నారింజ పండు సహాయపడుతుంది. శిశువుల్లో మెదడు, వెన్నెముక లోపాలు రాకుండా చేయడంలో కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల అలర్జీల బారిన పడకుండా ఉంటారు. వీటిలోని ఫైబర్ ప్రేగులలో కదలికలను పెంచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా నివారించబడుతుంది. నారింజ పండ్లను తినడం వల్ల గర్భిణీలలో రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. గుండెను, ఊపిరితిత్తులను, మూత్ర పిండాల పని తీరును మెరుగుపరచడంలో ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. నారింజ పండును తినడం వల్ల తల్లీ బిడ్డలకు ఎంతగానో మేలు కలుగుతుంది. కనుక గర్భిణీలు ప్రతిరోజూ ఒక నారింజ పండును తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.