Ripen Banana | మనకు అందుబాటులో ఉన్న అత్యంత చవక ధరకు లభించే పండ్లలో అరటి పండ్లు ఒకటి. మనకు ఇవి మార్కెట్‌లో రకరకాల వెరైటీలు లభిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో మనకు లభించే అరటి పండ్లు పూర్తిగా పండనివే అయి ఉంటున్నాయి. బాగా పండిన అరటి పండ్లు లభించడం లేదు. కానీ న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం.. అరటిపండ్లను బాగా పండిన తరువాతనే తినాలి. ఎందుకనో.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
1. బాగా పండిన అరటి పండ్లు చాలా సులభంగా జీర్ణం అవుతాయి. చిన్నారులు, వృద్ధులు కూడా బాగా పండిన అరటి పండ్లను తింటేనే సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాలు తగ్గుతాయి.
2. సాధారణంగా పండిన అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
3. ఒక మోస్తరుగా పండిన అరటి పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. చిన్నారులకు బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల వాటిని వారు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. దీంతో అరటిపండ్లలో ఉండే ముఖ్యమైన పోషకాలు వారికి లభిస్తాయి. ఇవి వారి పెరుగుదలకు దోహదపడతాయి.
5. బాగా పండిన అరటి పండ్లను తింటే శక్తి బాగా లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. నీరసం, నిస్సత్తువ తగ్గిపోతాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాయామం చేసేవారు, రోజంతా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు.. బాగా పండిన అరటి పండ్లను తింటేనే శక్తి బాగా లభిస్తుంది. దీంతో అలసిపోకుండా పనిచేయవచ్చు.
గమనిక: డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు బాగా పండిన అరటి పండ్లను తినరాదు. ఒక మోస్తరుగా పండిన అరటి పండ్లనే తినాలి.