మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు సమస్య ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైపోయింది. ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు వారి ఆహారంలో కొర్రలను చేర్చుకుంటే చాలు 15 రోజుల్లో శరీరంలో మార్పును గమనించవచ్చు. ప్రస్తుత తరుణంలో వీటి వాడకం తక్కువైంది. కానీ పూర్వకాలంలో వీటిని విరివిరిగా ఉపయోగించేవారు. కొర్రలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పని చేసుకోవచ్చు.
బరువు తగ్గడానికి కొర్రలను ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొర్రల్లో విటమిన్ బి తోపాటు మాంగనీస్, కాల్షియం, జింక్, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన శక్తి కొర్రలకు ఉంటుంది. నెలరోజుల పాటు బియ్యంతో వండిన అన్నానికి బదులుగా కొర్రలతో వండిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి సన్నగా నాజుకుగా తయారవుతారు.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా కొర్రలు చక్కని ఔషధంలా పని చేస్తాయి. కొర్ర బియ్యంలో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. కొర్రల్లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కనుక ఇవి త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ కొర్రలతో చేసిన జావను తాగడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి.
తరచూ కొర్రలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. శాకాహారులకు కొర్రలు ఎంతో చక్కని ఆహారమని చెప్పవచ్చు. కొర్రలను తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. జ్వరంతో బాధపడుతున్నప్పుడు కొర్ర జావను తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు, రక్త హీనత సమస్యలతో బాధపడే వారు కొర్రలను తరచూ తీసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.
గర్భిణీలు, బాలింతలకు కొర్రలు చక్కని ఆహారంలా పని చేస్తాయి. కొర్ర అన్నం తయారు చేసుకోవాలనుకునే వారు ఒక గ్లాస్ కొర్రలకు మూడు గ్లాసుల నీళ్లను పోసి ఉడికించాలి. కేవలం కొర్ర అన్నమే కాకుండా కొర్రలతో పులిహోర, కిచిడీ వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రలను రవ్వగా చేసి దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. కొర్రలను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక కొర్రలను తగిన మోతాదులో తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని నిపుణులు చెబుతున్నారు.