Pistha Side Effects : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవడంతో పాటు చాకొలెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, డిసర్ట్స్ వంటి వాటితో పాటు ఇతర తీపి వంటకాల్లో కూడా పిస్తా పప్పును విరివిరిగా ఉపయోగిస్తారు. పిస్తా పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా అనేకం ఉంటాయి. పిస్తా పప్పులను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారమని చెప్పవచ్చు.
అలాగే వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. పిస్తా పప్పు ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పును ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అలాగే తలనొప్పి, కళ్లు మ్సకగా కనిపించడం, తలతిరిగినట్టు అనిపించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అదే విధంగా ఉప్పుతో కూడిన పిస్తా పప్పును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి బదులుగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని ఎన్ని తిన్నామో తెలియకుండా తినేస్తూ ఉంటారు.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మనం బరువు తగ్గుతామని కనుక రోజూ మనం తీసుకునే పిస్తా పప్పు మోతాదులో నియంత్రణ కలిగి ఉండాలని వారు చెబుతున్నారు. అదే విధంగా పిస్తా పప్పులో ఆక్సలేట్స్, మెథియోనిన్ ఎక్కువగా ఉంటాయి. పిస్తా పప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్స్ మరియు మెథియోనిన్ విడుదల పెరుగుతుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియం మరియు పొటాషియంతో బంధించబడి కాల్షియం మరియు పొటాషియం ఆక్సలేట్లు ఏర్పడతాయి. అలాగే మెథియోనిన్ సిస్టీన్ గా మారవచ్చు. ఈ సిస్టీన్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దారి తీయవచ్చు.
కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. అదే విధంగా ఈ పిస్తా పప్పును ఎక్కువగా తినడం వల్ల కొందరిలో ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వాంతులు, నోటిలో దురద, తిమ్మిర్లు, వికారం వంటి లక్షణాలు కనబడే అవకాశం కూడా ఉంది. ఎలర్జీ సమస్య ఉన్న వారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఈ దుష్ప్రభావాల కంటే పిస్తా పప్పు వల్ల మనకు కలిగే మేలే ఎక్కువగా ఉంటుంది. పిస్తా పప్పులో విటమిన్ బి1, బి6, ఫైబర్, ప్రోటీన్స్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాల్లో ఇవి ఒకటి. కనుక వీటిని ఆహారంగా భాగంలో తప్పకుండా తీసుకోవాలని అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.